Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

స్మృతి

ఓం శ్రీ గురుభ్యో నమః

127ఉపనిషత్తుల సారమైన శ్రీమద్భగవద్గీతా శాస్త్రము యొక్క పరమోద్దేశ్యం ఏమిటో అంతిమముగా బోధకుడైన గురువు అడిగిన ప్రశ్న వల్లనూ, శిష్యుని సమాధానము వల్లనూ స్పష్టపడుచున్నది. శ్రీమద్భగవద్గీతను పారాయణం చేస్తే పొందవలసిన ఫలమేదో క్రింది రెండు శ్లోకాలలో విశదమౌతున్నది.

కచ్చిదేతచ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా !
కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ !                 18వ అ/72

పార్థా! భగవద్గీతా శాస్త్ర బోధను ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ధనంజయా! అజ్ఞానము వల్ల ఉత్పన్నమైన మోహము పోయిందా?

నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్మయా చ్యుత !
స్థితో స్మి గత సందేహః కరిష్యే వచనం తవ !                                    18వ అ/73

మీ కృప వలన నా మోహం పోయింది. స్మృతిని పొందాను. సంశయ రహితుడనై జారిపడని స్థితిలో ఉన్నాను. తమ వచనములను ఆచరిస్తాను.

 శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాలలో పొందుపరచిన మహత్తరమైన బోధ ఎందుకోసమూ అంటే, ముఖ్యంగా మోహం పోగొట్టటానికిస్మృతి కలిగించటానికి, సందేహాలు తీర్చటానికి. మోహము అంటే అజ్ఞానము వలన ఏర్పడిన భ్రమతెలియకపోవటమే అజ్ఞానం. దేహం తోసహా గోచరిస్తున్నదంతా సత్యమని అనుకోవటమే అజ్ఞానం. ఇదంతా అశాశ్వతమైనది దుఃఖాన్ని కలిగించేదీ అని తెలుసుకోవటమే నిజంగా తెలుసుకోవటము అంటే. అసత్ జడ దుఃఖ స్వరూపమైన దేహం నేను కాదు, నేను సత్ చిత్ ఆనంద స్వరూపమును, అని కేవలం తెలుసుకోవటం కాదు. స్మృతిర్లబ్డా అంటే స్మృతిని పొందటంమొదట నేను ఎవరో నేను కానిదేదో అవగాహన చేసుకొని శ్రీమద్భగవద్గీత పట్ల, సద్గురువు పట్ల విశ్వాసం ఏర్పరచుకోవాలి. దోషాల నుండి బయటపడాలి. రాగ ద్వేషాలు లేకుండా ఉండాలిశాశ్వతమైన స్వరూపాన్ని గుర్తించి నిరంతరం స్వరూప స్మరణలో ఉండాలి. అశాశ్వతమైన, అనుక్షణమూ ఒక నియతికి లోబడి ప్రవర్తిస్తూ, మారుతూ, మరణిస్తూ వున్న చరాచర సృష్టిలో దేనిపట్లనైనా ద్వేషభావం అసలు ఎందుకు కలగాలి? "అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ.." అన్నట్లు జీవి పట్ల గాని, వస్తువు పట్ల గాని, సన్నివేశం పట్ల గాని ద్వేష భావం లేకుండా, మైత్రీ భావము, కరుణతో వుండాలి. క్షణ క్షణము మారుతున్న దేహం నేను కాదు, అలాగే దేహం గాని, దేహ సంబంధమైనది ఏదైనాగాని, మరే ఇతర వస్తువు గాని, వ్యక్తి గాని నావలె శాశ్వతమైనది ఇక్కడ లేనే లేదు. నాది అనుకోవటానికి ఏమున్నదిక్కడ? అలాగే ద్వంద్వాలలో పడిపోకుండా వుండాలి. అప్పుడు మనస్సు నిర్మలమై స్మృతి కలుగుతుంది. అది స్వరూపానికి సంబంధించిన ఎరుక. మనసులో ఏర్పడేది కాదు. స్మృతి ఆలోచనలు లేని స్థితి.

అనేక సందర్భాలలో అనేక రీతులలో ఎరుక అందరికీ అనుభవమౌతున్నదేఒక వస్తువుపై దృష్టి సారించి విచారణ, విశ్లేషణ చేయకుండా కేవలం అలా ఉండే స్థితే ఎరుక.అప్పుడు నేను చూస్తున్నాననే భావన వుండదు. సాధారణంగా అందరికీ ఎరుక బహు కొద్దిసేపు (0.24 సెకను అంటే ఒక సెకనులో నాల్గవ వంతుకంటే తక్కువ సమయము) మాత్రమే వుంటుంది. ఇంతలో మనో విశ్లేషణ మొదలౌతుంది. అందువల్ల ఎరుకను గుర్తించడం కష్టమౌతుంది. ఐతే సాధనతో ఎరుకను పెంచుకోవటం సాధ్యపడుతుంది. మనస్సు మంత్ర జపంలో నిమఘ్నమై యున్నప్పుడు, ఒక్కొక సమయంలో మంత్రాన్ని విడిచి విషయాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు  గమనిస్తుండేది ఎరుక మాత్రమే. మంత్రం పైకి మనస్సు ఎకాగ్రమవ్వటానికి సహాయపడేది ఎరుక మాత్రమేఅంటే మనస్సు యొక్క చర్యను గమనిస్తున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే ఎరుక లేదా స్మృతి అనబడుతున్నది. అక్కడ మనో విశ్లేషణ లేదు. అందువల్ల అహంకారం లేదు, ద్వంద్వాలు లేవు, వివేకంతో కూడిన ఒక ప్రజ్ఞమనస్సు, జ్ఞానేంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని తెలుసుకోవటమే స్మృతి. ఆధ్యాత్మిక సాధనల అంతిమ లక్ష్యం స్మృతిని పెంచుకోవటమే. నిరంతరమూ స్మృతితో వుండాలంటే దోషాలను పోగొట్టుకోవాలి. యజ్ఞ, దాన, తపో కర్మలను శాస్త్రానుసారం ఆచరిస్తున్నప్పుడు స్మృతిని నిరంతరం అలా ఉంచుకోవటం సాధ్యపడుతుంది. రజోగుణ సంబంధమైన అసుర భావాలను గుర్తించుకొంటూ, పోగొట్టుకొంటూ వున్నప్పుడు స్మృతిని కాపాడుకోవటం కుదురుతుంది. స్మృతి వెలుగులో మనిషి తన అసుర వాసనలను నిర్మూలించుకోవచ్చు. స్మృతి ఉన్నప్పుడు ఏదేది ఎలా ఉన్నప్పటికీ, ఇదంతా అశాశ్వతమే, మారేదీ, పోయేదే కదా అనే వివేకం పని చేస్తుంటుంది. అందువల్ల విషయాల పట్ల అనాసక్తితో ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రవర్తించటం, పని ముందుకు వచ్చినా ఫలాసక్తి లేకుండా ఉత్సాహంతో అత్యంత కౌశలంతో నిర్వర్తించటం జరుగుతుంది.  మంత్ర సాధన వల్ల స్మృతిని పెంచుకోవచ్చు. స్మృతి వలన మంత్ర సాధనలో ఏకాగ్రత పెరుగుతుంది. విధంగా మంత్ర సాధన, స్మృతి పరస్పర సహాయంతో సహకరించుకుంటాయి. రాగ ద్వేషాలను పోగొట్టుకొన్నప్పుడు స్మృతి పెరుగుతుంది. స్మృతితో వున్నప్పుడు మాత్రమే రాగద్వేషాలను సమూలంగా, వాసనా సహితంగా నిర్మూలించుకోవటం కుదురుతుంది. స్మృతి పెరగాలంటే బాహ్య విషయాల పట్ల ఆసక్తిని పోగొట్టుకోవాలి. స్మృతిని పెంచుకోవటానికి నిరంతరమూ ప్రయత్నం చేయాలి.

స్మృతి ఇది అని నిర్వచించటానికి సాధ్యపడదు. అందరూ స్మృతిని అనుభవానికి తెచ్చుకోవచ్చు. స్మృతి యొక్క వెలుగులో నిత్య జీవితంలో ఎదురౌతున్న మానావమానాలలో, సుఖ దుఃఖాలలో, శీతోష్ణాలలో, జయాపజయాలలో, లాభానష్టాలలో ఏది ఎదురైనా పొంగిపోవటం గాని, కుంగిపోవటం గాని లేకుండా నిర్వికారంగా, నిశ్చలంగా, శాంతిగా, సంతోషంగా వుండటం సాధ్యపడుతుంది. స్మృతిని పెంచుకొని నిరంతరమూ కాపాడుకోవాలి.

స్మృతి ఎందుకు పోతుంది అని మనం చూసినప్పుడు, శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం క్రింది విధంగా సూచిస్తున్నది.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే !
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే !                                   2వ అ/62

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః !
స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి !                                        2వ అ/63

విషయాలను ధ్యానిస్తున్నప్పుడు పురుషునికి విషయాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి నుండి కోరిక పుడుతుంది. కోరిక విపరీతమై క్రోధంగా పరిణమిస్తుంది. క్రోధము వలన మోహముత్పన్నమై, మోహములో పడినప్పుడు స్మృతి పోతుంది. స్మృతి పోయినప్పుడు వివేక బుద్ధి నశిస్తుంది. వివేక బుద్ధి నశించినప్పుడు పురుషుడు పతనమౌతాడు.

కన్ను ఒక వస్తువును చూస్తున్నప్పుడు, కన్ను వస్తువును చూస్తున్నది అని తెలుసుకోవటం వరకు బాగానే వున్నది. ఐతే వస్తువును గురించి మళ్ళీ మళ్ళీ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు, వస్తువు ఏమిటసలు?, ఇది ఎందుకు పనికి వస్తుంది?, ఇది ఇలా ఎందుకుంది? ఇది ఇక్కడెందుకుంది? అని వస్తువు గురించి ఆలోచిస్తున్నప్పుడు, దాని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువు ఫలానా విధంగా ఫలానా చోట వుంటే బాగుంటుంది అనే కోరిక పుడుతుంది. కోరిక నేరవేరనప్పుడు కోపం వస్తుంది. కోపము వలన వస్తువు తాననుకున్న విధంగా వుండటం తనకు అవసరమే అనే భ్రమ కలుగుతుంది. శాశ్వతుడైన తనకు అశాశ్వతమైన వస్తువుతో ఉపయోగమేమున్నది? కాని అవసరం ఉన్నదనే భ్రమలో పడి తనను తాను మరచిపోయాడు. ఎప్పుడైతే తన స్మృతి పోయిందో, అప్పుడు తాను ఆత్మ స్వరూపమనే నిశ్చయం (ఆత్మిక బుద్ధి) నాశనమైపోయింది. వివేక బుద్ధి నశించినప్పుడు శాశ్వతుడైన పురుషుడు తాను అసత్ జడ దుఃఖ స్వరూపమైన దేహమునే భావము లోనికి జారి పడిపోతున్నాడు. ఇదే పతనమవ్వటం. విషయ చింతన ఎంతటి ఉపద్రవానికి దారి తీస్తుందో ఇక్కడ స్పష్ట పరుస్తున్నది శ్రీమద్భగవద్గీత.

ఇంద్రియాలు వాటి వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు పురుషుడు ఎలా వుండాలో శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం లో సూచిస్తున్నది.

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ !
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ !                     5వ అ/8

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి !
ఇంద్రియాణీన్ద్రియార్దేషు వర్తంత ఇతి ధారయన్ !                                            5వ అ/9

సత్యమునెరిగిన వాడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పర్శిస్తున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, వెళ్ళుచున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు (నిద్రిస్తున్నప్పుడు), శ్వాసిస్తున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, విడిచిపెడుతున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, కనులు తెరుస్తున్నప్పుడు, కనులు మూస్తున్నప్పుడు ఇంద్రియములు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయి గాని నేను కించిత్తు కూడా ఏమీ చేయుటలేదు అని భావించును.

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి !
యోగినః కర్మ కుర్వన్తి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే !                                      5వ అ/11

దేహము యొక్కయు, ఇంద్రియముల యొక్కయు, మనస్సు యొక్కయు, బుద్ధి యొక్కయు ప్రతి కదలికనూ విషయాసక్తిని విడిచి ఆత్మ భావమును శుద్ధి పరచుకొనుటకు మాత్రమే వినియోగించుకొనువారు యోగులు.

జీవన్ముక్తావస్థ యొక్క మాధుర్యాన్ని అనుభవించటానికి ఉపయోగపడేది స్మృతి మాత్రమే. సాధకుడైన వాడు ప్రతి కదలికనూ ఆసరా చేసుకొని తాను తానుగా ఉండాలి. నిత్యమూ స్మృతిలో ఉండాలి. తన ముందున్న పనులను ఉదాశీనంగా పాల్గొంటూ, సద్గురువు ఇచ్చిన సాధనలను నియమబద్ధంగా ఆచరించాలి. కూర్చుని చేసే సాధనల తో ఎరుకను పెంచుకుంటూ, నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సన్నివేశాలలోనూ ఎరుకను కాపాడుకుంటూ ఉండాలి. శ్రీమద్భగవద్గీత చెప్పిన విషయాలను ఆచరణ లోకి తీసుకొని సాధన చేస్తున్నప్పుడు మాత్రమే స్మృతిని పెంచుకోవటము, కాపాడుకోవటము కుదురుతుంది

జై గురుదేవ్ !

సర్వేషాం స్వస్తిర్భవతు ! అందరికీ శుభమే జరుగుగాక !
సర్వేషాం శాంతిర్భవతు ! అందరూ సుఖ శాంతులతో ఉండుగాక !
సర్వేషాం పూర్ణం భవతు ! అందరి జీవితమూ సమృద్ధిగా ఉండుగాక !
సర్వేషాం మంగళం భవతు ! అందరి జీవితమూ మంగళకరంగా ఉండుగాక !
లోకాః సమస్తాః సుఖినో భవంతు !!
ఓం శాంతి: శాంతి: శాంతి: !!!

ఇది అపార  కరుణామయులు, అనంత దైవ సంపన్నులు, సాక్షాత్ జ్ఞాన స్వరూపులు, మర్మయోగి, సచ్చిదానంద సమర్థ సద్గురు మహాత్ములైన శ్రీ శ్రీ శ్రీ భవఘ్ని గురు దేవుల దివ్యానుగ్రహ సత్సంగ ప్రవచనములనుండి వారి శిష్యులలో నధమ శ్రేణికి చెందిన ఒకానొక సాధకునిచే గ్రహించబడినది. దీనిని పరిశీలించిన పండితులిందుగల జ్ఞాన విషయములు శ్రీ గురు దేవుల అమృత వాక్ధారల నుండి జాలువారినవిగను, దోషము లేవైన గన్పట్టిన నవి సాధకుని జ్ఞానలేమి వలన మాత్రమే సంభవించి నట్లుగను గ్రహింప గలరు.