Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

ప్రారబ్దమా? ప్రయత్నమా?

ఓం శ్రీ గురుభ్యో నమః  

114అనేక జన్మలలో మనం చేసిన కర్మల ఫలాలు పాప పుణ్యాల రూపములో రాశులుగా వున్నాయి. ఇవే సంచిత కర్మలు అనబడుతున్నాయి. వాటిలో నుండి జన్మకు కారణమైన ఒక పిడికెడు కర్మ ఫలాలతో దేహమును పొందాము. జన్మలోనే అనుభవించి తీరాలని నిర్దేశించబడిన పిడికెడు పూర్వ కర్మల ఫలాలను ప్రారబ్దము అంటున్నారు. ఇంతకు ముందు చేసిన కర్మల ఫలాలను నేడు అనుభవిస్తున్నాము. అదే ప్రారబ్దము అనబడుతున్నది. నేడు చేస్తున్న కర్మలకు ఫలితం రేపు (భవిష్యత్తులో) అనుభవించబోతున్నాము. దీనిని ఆగామి అంటారు. మనస్సు, వాక్కు, దేహము అనే మూడు ఉపకరణాలలో కదలికలనే కర్మ అంటారు. అందువల్ల మానసిక కర్మ, వాక్కర్మ, శారీరక కర్మ అనే మూడు విధాలుగా మనం కర్మలు చేస్తున్నాము. మూడు విధాలుగా చేయబడుతున్న కర్మలు సత్కర్మ, దుష్కర్మ అని రెండు రకాలు ఉంటాయి.  సత్కర్మల ఫలితం సుఖం రూపంలోనూ, దుష్కర్మల ఫలితం దుఃఖం రూపంలోనూ పొందవలసి వుంటుంది. ఇది అందరికీ అనుభవమే. వాక్కర్మ, దేహకర్మలు చేస్తున్నప్పుడు అవి స్పష్టంగా అందరికీ తెలుస్తున్నాయి గనుక తదనుగుణంగా లభించే ఫలితాలను అందరూ సులభంగానే అన్వయించుకో గలుగుతున్నారు. కానీ, మానసిక కర్మ జరుగుతున్నప్పుడు, అది అందరికీ తెలియబడుట లేదుఅందువలన మానసిక కర్మ ఫలాలను అన్వయించుకోవటంలో భంగపడుతున్నారు. దానికి కారణం మానసికంగా చేస్తున్న కర్మలను గుర్తించకపోవటం మాత్రమే. ఖాళీగా కూర్చుని వున్న వ్యక్తిని, ఏమి చేస్తున్నావని అడిగినప్పుడు, ఆలోచిస్తున్నాననే సమాధానం చెప్పడం సహజమే గదా. అంటే అక్కడ మనసుతో ఒక కర్మ చేస్తున్నట్లు తెలుస్తూనే వుంది. ఐతే ఎంతోమంది కేవలం ఆలోచనలతో చేసే కర్మలకు సైతం ఫలితాలుంటాయని తెలియక, అవి ఇతరులకు తెలియవు గనుక  మానసిక దుష్కర్మ చేస్తుంటారుఇతర కర్మలతో పోల్చి చూసినప్పుడు మానసిక కర్మ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. అన్ని కర్మలకూ ఫలితాలను సంపూర్ణంగా అనుభవించి తీరవలసిందే. ఇది సృష్టి నియమం. దీనినే నియతి అంటారు.

ఒక వ్యక్తి దుష్కర్మ చేసి కోర్టులనుండి శిక్ష తప్పించుకోవచ్చు. కాని దుష్కర్మ ఫలితాన్నిమాత్రం అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడా వ్యక్తి తన పూర్వపు కర్మల సత్ఫలితాన్ని అనుభవిస్తూండవచ్చు. ఇప్పుడు చేస్తున్న దుష్కర్మకు ఫలితం అనుభవింప జేయడానికి  భవిష్యత్తు సిద్ధంగానే వుంటుంది. ఎంతోమంది ఎన్నెన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ కూడా ఎన్నో ఇబ్బందులూ, బాధలూ పడుతూ వుంటారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా, దుష్ఫలితాలే ఎదురౌతుంటే నిరుత్సాహపడి ధార్మిక కార్యక్రమాలను వదివేస్తారు. అలా వున్నప్పుడు వాళ్ళు రేపుకూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసి వుంటుంది. ఇప్పుడు సత్కర్మలు చేస్తే రేపైనా సుఖం అనుభవించ వచ్చు. ఇది అవగాహన చేసుకుని అందరూ సత్కర్మ చేయటానికి ఉద్యమించాలి.

ఎవరు మనతో ప్రారబ్దాన్ని అనుభవింప జేస్తున్నారు? నియతి ఎలా అనుభవింప జేస్తున్నది? అది ఎక్కడ వుండి చేయిస్తున్నది? నియతి అందరి బుద్ధిని ప్రేరేపిస్తుంటుంది. వారి వారి ప్రారబ్దానుసారం ప్రయత్నాలు చేస్తుంటారు.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే: జ్ఞానవానపి !
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి !                      3వ అ/33

సర్వ కర్మలు ప్రకృతి ప్రేరణ వల్లనే నిర్వహించ బడుతుండగా, జ్ఞానవంతుని (వాచా జ్ఞానంతో వున్న వాని) కైనా నిగ్రహము వలన ఎట్టి ప్రయోజనమూ కలుగనేరదు.

నియతి (గత కర్మల వలన ఏర్పడిన స్వభావం) బుద్ధిని ప్రేరేపిస్తుంది. నీచేత ప్రారబ్దాన్ని అనుభవింప జేయటం కోసం అవసరమైన కర్మ చేసే విధంగా నీ స్వభావం నీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. విషయం తెలిసిన వాడివైనప్పటికీ, కర్మ చేయగూడదని ఎంత నిగ్రహించుకోవాలని చూసినా, నిగ్రహించుకోవటం నీకు సాధ్యపడదు. ప్రారబ్దం కట్టి కుడుపుతుంది అంటారు. అది అనుభవించటానికి నీవు కర్మ చేయాలో కర్మ నీ స్వభావమే నీతో చేయిస్తుంది. కేవలం తెలిసి ఉన్నంత మాత్రాన స్వభావానికి విరుద్ధంగా ఏపనీ చెయ్యలేవు. అందరూ బద్దులే. బుద్ధి కర్మానుసారిణి అంటారు. అంటే వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళ బుద్ధి ప్రేరేపించబడుతుంది.

ఒకడు ఒక తప్పుచేసి ఎందఱో దుఃఖించ టానికి, మరణించ టానికి కారణమైనాడు. కాని కోర్టులో మంచి లాయరును పెట్టుకొని శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. మరో జన్మ తీసుకొని మంచి నడక నడుస్తున్నాడు. అతనికి కొందరు స్నేహితులున్నారు. వారు ఒకసారి ఒక బ్యాంకు దోపిడీకి పథకం వేశారు. పకడ్బందీగా వేసిన పథకంలో ఇతని సహాయం కోరారు. దొంగతనం చేయటం ఇతనికి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల దొంగతనంలో పాలు పంచుకోవటానికి ఈతడు ఒప్పుకోలేదు. ఐతే స్నేహితులు ఇతడ్ని బ్రతిమిలాడారు. వాళ్ళు దోపిడీ చేసే సమయంలో ఇతడు బయట వుండి ఎవరైనా అటువైపు వస్తే తమను హెచ్చరించే విధంగా ఒప్పించారు.  యీతడు బయట నిలబడి వుండగా వాళ్ళు బ్యాంకులోనికి ముందనుకున్న విధంగా ప్రవేశించి దోపిడీ చేసి వెళ్ళిపోయారు. కాని దోపిడీ జరిగిన సమయంలో ఈతడు బయట నిలబడి వున్న విషయం CC కెమెరా లో రికార్డ్ అయ్యింది. పోలీసులు ఇతడ్ని పట్టుకొని శిక్ష వేయించారు. అన్నీ మంచి పనులే చేస్తున్న నీవు పని ఎందుకు చేశావని అడిగితే, అతడు, "నా ఖర్మ! ప్రారబ్దం వల్ల అటువంటి స్నేహితులు దొరికి నన్ను అన్యాయంగా ఇరికించారు." అంటాడు.  

సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ద కర్మ మనలను చుట్టుముట్టి వున్నాయి. మనం అనుభవించ వలసిన ఫలితం సిద్ధించడానికి కావలసిన కర్మలు చేసే విధంగా స్వభావం ప్రోత్సహిస్తున్నది. అందుకు తగిన సన్నివేశాలను, సందర్భాలను, వ్యక్తులను, అవసరాలను, అవకాశాలను కల్పిస్తున్నది నియతి. ఐతే శాస్త్రం ఏమి చెప్తున్నది?

ఆపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః !
సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి !                                      4వ అ/36

పాపాత్ములలోకెల్లా మహా పాపములు చేసినవాడివైనా సరే జ్ఞానమనే నావను ఎక్కితే పాప సముద్రాన్ని సులభముగా దాటగలవు.

యథై ధాంసి సమిద్ధో గ్ని: భస్మసాత్కురుతే ర్జున !
జ్ఞానాగ్ని: సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా !                                 4వ అ/37

ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేయునట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నిటినీ భస్మమొనరించును.

సంచిత కర్మలన్నీ బూడిదై పోతాయి. ఇంతకు ముందు చేసిన కర్మలను, ఇప్పటివరకు చేస్తున్న కర్మలను పూర్తిగా దగ్ధం చేసుకుంటాము. మరి ప్రారబ్దం సంగతేమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. అదేమిటంటే ఇక్కడ అంతా ప్రారబ్దం ప్రకారం దానంతటదే జరుగదు. ప్రయత్నం ఒకటున్నది. ప్రయత్నంతో ప్రారబ్దాన్ని సైతం జయించవచ్చు. ప్రారబ్దం బుద్ధిని ప్రేరేపిస్తున్నది. అది నీకు మంచిదే అనిపిస్తుంది. దాన్నుంచి ఎలా తప్పించుకోవటం?  

ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ !
తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపన్థినౌ !                                      3వ అ/34

ప్రతి ఇంద్రియ విషయమునందును రాగ ద్వేషములు పొంచియున్నవి. మనిషి వీటికి వశము కారాదు. రెండూ మనిషి శ్రేయస్సుకు ప్రబల శత్రువులు. ఒక ఆలోచన కలిగినప్పుడు అలా చేద్దామా వద్దా అన్న నిర్ణయం నీ చేతిలోనే వున్నది. వివేకం మనిషికి మాత్రమే వున్నది. జ్ఞాన మార్గంలో వున్నప్పుడు నీ వివేకం పని చేస్తూ వుంటుంది. అటునుండి ప్రారబ్దం బుద్ధిని ప్రేరేపిస్తున్నప్పుడు, వివేకం జ్ఞాన బలంతో (శాస్త్ర ప్రకారం నడుస్తున్నప్పుడు) ప్రయత్నాన్ని బుద్ధి ప్రేరణకు వ్యతిరేకంగా నడిపిస్తుంది. రెండు పొట్టేళ్ళు డ్హీకొన్నప్పుడు ప్రయత్నమే గెలుస్తుందిసాధారణంగా ప్రారబ్దం నీ స్వభావంలో ఇష్టాయిష్టాల రూపంలో నిక్షిప్తమై వుండి, ఒక వ్యక్తి పట్ల, ఒక విషయం పట్ల, ఒక సంఘటన పట్ల, ఒక సన్నివేశంలో, ఒక సందర్భంలో నీవు ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తిస్తే నీకు లాభాదాయకమో, సుఖకరమో, క్షేమమో అలా  నీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఐతే జ్ఞాన మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు, నీ వివేకం, దేహివైన నీకు అశాశ్వతమైన ప్రయోజనాల పట్ల విముఖత కలిగేటట్లు, ఇష్టాయిష్టాలతో ఉపయోగమూ వుండదు గనుక వాటికి లోబడక శాశ్వత ప్రయోజనాన్ని ఆశించేవిధంగా నీవు ఎల్లప్పుడూ శాస్త్ర నిర్దేశానుసారం ప్రవర్తించేటట్లు ప్రోత్సహిస్తుంది. అందువల్ల నీ ప్రయత్నం స్వభావరీత్యా కాకుండా శాస్త్రానుగుణంగా వుండటం వలన ప్రారబ్దం నిన్నేమీ చేయలేదు. జ్ఞాన మార్గములో నడుస్తున్నప్పుడు ఇదంతా మారేదే పోయేదే అనే దృష్టి ఏర్పరచుకొని వుంటారు. ఆత్మ లాభం కంటే మించినదేదీ లేదని భావిస్తుంటారు. వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, విషయాల పట్ల రాగ ద్వేషాలు లేకుండా వుంటారు.

శ్రీమద్భగవద్గీత విధంగా నడవమందో విధంగా నడవటమే ప్రయత్నం. అలా వున్నప్పుడు ప్రారబ్దం ఎక్కడ వున్నది?  

జై గురుదేవ్ !

ఓం సర్వేషాం స్వస్థిర్భవతుఅందరికీ శుభమే జరుగుగాక !
సర్వేషాం శాంతిర్భవతుఅందరూ సుఖ శాంతులతో ఉండుగాక !
సర్వేషాం పూర్ణం భవతుఅందరి జీవితము సమృద్ధిగా ఉండుగాక !
సర్వేషాం మంగళం భవతుఅందరి జీవితము మంగళ కరంగా ఉండుగాక !
లోకాః సమస్తాః సుఖినో భవంతు !
ఓం శాంతి: శాంతి: శాంతి:

ఇది అపార  కరుణామయులు, అనంత దైవ సంపన్నులు, సాక్షాత్ జ్ఞాన స్వరూపులు, మర్మయోగి, సచ్చిదానంద సమర్థ సద్గురు మహాత్ములైన శ్రీ శ్రీ శ్రీ భవఘ్ని గురు దేవుల దివ్యానుగ్రహ సత్సంగ ప్రవచనములనుండి వారి శిష్యులలో నధమ శ్రేణికి చెందిన ఒకానొక సాధకునిచే గ్రహించబడినది. దీనిని పరిశీలించిన పండితులిందుగల జ్ఞాన విషయములు శ్రీ గురు దేవుల అమృత వాక్ధారల నుండి జాలువారినవిగను, దోషము లేవైన గన్పట్టిన నవి సాధకుని జ్ఞానలేమి వలన మాత్రమే సంభవించి నట్లుగను గ్రహింప గలరు.