Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

సాక్షిగా ఉండు

ఓం శ్రీ గురుభ్యో నమః

100మానవ దేహం మోక్షానికి ద్వారం అని పెద్దలు చెప్తారు. ఐతే ఇది సార్థకం చేసుకోవటానికి ఏ జ్ఞానం తెలుసు కోవాలో అది తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకున్నప్పుడు మళ్ళీ అనేక జన్మలు పొందవలసి వుంటుంది. అల్పమైన, అశాశ్వతమైన కోరికలతో సతమతమౌతూ మానవ జీవితం యొక్క విశిష్టత గుర్తించ కుండా సుదీర్ఘమైన ఈ ప్రయాణానికి గమ్యం ఏదో, గమ్యం చేరాలంటే ఏ ప్రయత్నం చేయాలో తెలుసు కోకుండా ఇతర జంతువుల వలెనే శరీర పోషణ కోసమూ, దేహ సౌఖ్యాల కోసమూ, భద్రతకోసమూ, ఇతర జీవులపై ఆధిపత్యం కోసమూ మనో, వాక్కాయ కర్మలు వృధా చేస్తూ పరిమితమైన తన జీవిత కాలాన్ని పూర్తిగా అందుకే వినియోగిస్తే 84 లక్షల జీవరాసులలో అరుదుగా లభించే మానవ జన్మ దుర్వినియోగ మైనట్లే నని పెద్దలందరూ చెప్తున్నారు. అరుదైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన్మ సఫలం చేసుకునే  ప్రయత్నం చేయని వారికి రాబోతున్నాయి లక్షలాది జన్మలు. దుఃఖ భూయిష్టమైన పశు, పక్షి, క్రిమి, కీటక, సరీనృపాది జన్మలు. మళ్ళీ అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎప్పటికి సంక్రమిస్తుందో ఎవరు చెప్పగలరు?  
 

శాశ్వతమైన, సచ్చిదానంద స్వరూపమైన పురుషుడు ఎలా పతనమౌతున్నాడో  శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయ మైన సాంఖ్య యోగంలో ఒక క్రమ పద్ధతిలో తెలియజేస్తున్నది.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే !
 సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే !                      2వ అ/62
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః !
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి !                           2వ అ/63

విషయాలను ధ్యానిస్తున్న పురుషునికి సంగమం ఏర్పడుతుంది. సంగమం నుండి కామం పుడుతుంది. కామం క్రోదానికి దారితీస్తుంది. క్రోధం మాయకు జన్మనిస్తుంది. మాయవలన ఎరుక పోతుంది. ఎరుక పోయిన వాని బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన వాడు పతనమౌతాడు.

ఎవరు పతనమయ్యేది? పుంసః అంటే పురుషుడు.  ఎవరీ పురుషుడు? దేహమనే పురంలో ఉన్నటువంటి ఆత్మ. శాశ్వతమైన, నరకబడని, కాల్చబడని, తడపబడని, శుష్కింప బడని, సర్వగతమైన, చలనరహితమైన, సనాతనమైన సచ్చిదానంద స్వరూపముగా ఉండవలసిన ఆత్మ స్వరూపుడైన పురుషుడు విషయ ధ్యానం వలన సంగమంలో పడి, తదనుగుణమైన కామంలో పడి, క్రోధియై, క్రోధంతో మాయలోపడి, మాయవల్ల తనను తాను మరచి, ఆత్మిక బుద్ధి నశించగా దేహభావంలోకి పతనమౌతున్నాడు.

శ్రీమద్భగవద్గీత ఎవరికీ బోధించబడుతున్నది? దేహముల కోసం కాదు. దేహములో వున్న దేహిని నేను, జీవాత్మను అనుకునే వాళ్లకు. ప్రతిమనిషి తన తల్లిదండ్రుల నుండి గాని, గురువుల నుండి గాని, ప్రామాణికమైన శాస్త్రాధ్యయనము వలన గాని మారుతున్న దేహములో జీవిస్తున్న మారని ఆత్మ స్వరూపము తాను అని తెలుసుకుని వుండాలి. నశిస్తున్న దేహాన్ని ఏదో ఒక రోజు వదలిపెట్ట వలసిందే ననే విషయం అందరికీ తెలుస్తూనే వుంది. మహా ఐతే నూరేళ్ళు జీవిస్తాము. ఈలోపే మరణం ఎప్పుడైనా రావచ్చు. లేదా తర్వాత తప్పకుండా ఈ దేహం విడిచి పెట్టాల్సిందే. ఇది ప్రతిఒక్కరి విషయంలోనూ తప్పకుండా జరిగి తీరుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమందిని చూస్తూనే ఉన్నాము. ఒక మనిషి మరణించిన తర్వాత దేహాన్ని ఖననం చెయ్యటమో సమాధి చెయ్యటమో చేస్తున్నారు. ఆ తర్వాత మరణించిన వాని కోసం శ్రాద్ధకర్మలు (ఉత్తర క్రియలు) చేస్తున్నారు. అంటే మరణించిన వాడు ఎక్కడో ఉన్నాడనే కదా. ఇది అందరూ నమ్ముతున్న విషయమే. ఐనా మరణించిన వారికోసం కర్మ కాండలెన్నో చేస్తున్న మనిషి తన కోసం ఏమి చేసుకుంటున్నాడు? జీవించినంత కాలం తన దేహం కోసమో దేహ సంబంధీకుల కోసమో తపన పడుతూ, శక్తి యుక్తుల నన్నిటినీ ధారపోస్తున్న మనిషి తనకు (దేహానికి కాదు) ఉపయోగపడే పని ఎందుకు చెసుకోవటం లేదు? తాను దేహాన్ని విడిచిపెట్టవలసిందే కదా. ఇందులో ఎట్టి సందేహమూ లేదు కదా. ఈ దేహాన్ని విడిచిపెట్టి మరో దేహంలో ప్రవేశించిన క్షణం నుండి ఈ దేహ సంబంధమైన వారితోగాని, ఇక్కడ కష్టపడి పోగుజేసుకున్న సంపదలతో గాని, సౌకర్యాలతోగాని, పేరు ప్రఖ్యాతులతోగాని తనకెట్టి సంబంధమూ ఉండనే ఉండదుగదా. అందువల్ల బ్రతికి వున్నంతకాలమూ తనకోసం ఇసుమంతైనా చేసుకోకుండా మరణించిన తర్వాత కేవలం ఇతరులు తన కోసం చేసే కర్మ కాండలపై ఆధార పడటం, అదీ వాళ్ళెంత శ్రద్ధగా చేస్తారో తెలియకుండా, వాళ్ళు చేసే కర్మలు నిజంగా తనకెంత వరకు ఉపయోగమో తెలియకుండా నిష్క్రమించటం సరైనదేనా అన్నది ప్రతి మనిషీ ఆలోచించ వలసిన విషయం.

అహర్నిశలూ దేహము కొరకో దేహ సంబంధీకుల కొరకో కష్టపడుతూ, ఇక్కడ విడిచిపెట్టి పోవలసిన సంపదలను కష్టపడి పోగుజేస్తూ, అందుకొరకే ఆలోచిస్తూ జీవితాన్ని దుర్వినియోగం చేసుకునే బదులు దేహిగా తనకు శ్రేయస్కరమైనదేదో, ఈ దేహంలో వున్నన్ని రోజులే కాకుండా అటుపిమ్మట కూడా తనకు ఉపయోగపడే సంపద ఏదో తెలుసుకొని అందుకొరకు తన కాలాన్నీ, శక్తి యుక్తులనూ ఉపయోగిస్తే జీవితం సద్వినియోగ మైనట్లు. ఆ సంపదలు తనకే కాకుండా  దేహానికి కూడా ఉపయోగపడతాయి. తానా ప్రయత్నంలో నిమఘ్నమై యున్నప్పుడు తన ప్రారబ్దం సైతం తనకు హాని కలిగించలేదని, సుఖ శాంతులు నిత్యానుభవంగా ఉంటాయని మహాత్ముల అభిప్రాయం.  ఇక్కడ అన్నీ మారేవీ, నశించేవీ కనిపిస్తున్నాయి. మనిషి వివేకంతో నిత్యమైనదేదో, అనిత్యమైనదేదో పరిశోధించాలి. ప్రతి వస్తువునూ, ప్రతివ్యక్తినీ, ప్రతి విషయాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ, ప్రతి సందర్భాన్నీ కేవలం ఆ దృష్టితోనే చూడాలి అని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్తున్నారు. ప్రామాణికమైన శాస్త్రాలూ ఈ విషయాన్నే బోధపరుస్తున్నాయి. ఈ వివేకం కేవలం మానవునికి మాత్రమే వుంది. ఇతర జీవులకు లేనే లేదు. దేహానికి వేరుగా తాను దేహంలో వుంటున్న విషయం మానవునికి తప్ప అన్య ప్రాణులకు అస్సలు తెలియనే తెలియదు. ఈ వివేకం మనిషికి ఎందుకు ఇవ్వబడిందో, దీనిని ఎందుకు ఉపయోగించాలో, దీనితో ఏది తెలుసుకోవాలో, ఏది సాధించాలో అందుకు కాకుండా దీనిని దేహానికి కావలసిన ఆహారమూ, సౌకర్యాలూ, రక్షణా, వగైరాల కోసమో, ఇతర జీవులను వశపరచుకుని అజమాయిషీ చలాయించటానికో మాత్రమే ఉపయోగిస్తే అది మూర్ఖత్వమే ఔతుంది. అప్పుడు మనిషి కూడా రెండు కాళ్ళ జంతువే ఔతాడు తప్ప మరేమీ కాలేడు అన్నది నిష్ఠుర మైనా సత్యమే కదా. ఒకప్పుడు భారత దేశంలో అందరూ సద్వివేకంతో ఆత్మ దృష్టి ఏర్పరచుకొని వుండేవారు. అప్పుడు వారందరూ త్రుప్తి, ఆనందములతో శాంతిగా జీవించేవారు. అందుకే అసలు భారత దేశానికి ఆ పేరు వచ్చింది. భా అంటే ప్రకాశము (జ్ఞానం) రత అంటే రమించే అంటే  ఆత్మ జ్ఞానంతో ఆనందించే వారికి నిలయమైన దేశం.

యో అంతః సుఖో అంతరారామ స్తథాంతర్జ్యోతిరేవయః !
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ధిగచ్చతి !                            5వ.అ/24

ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలోనే రమించుచూ, తనలోనే ప్రకాశమును పొందుతూ ఉంటాడో అతడే బ్రహ్మ భావముతో నున్న యోగి, పరబ్రహ్మ స్వరూపమును పొందుటకర్హుడు.    

ఇంతకీ పురుషునికి (బాహ్యమైన స్త్రీ పురుషులలో పురుషుడు కాదు), దేహమనే నవద్వార పురములో వున్న పురుషునికి అంటే దేహికి శ్రేయస్కరమైనది ఏది అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు మనిషి. ఈ సందర్భంలో ఒక విషయం అందరికీ స్పష్టంగానే తెలుస్తున్నది.  అది ఏమిటి అంటే, ఇక్కడ మనం కూడబెట్టుకుంటున్న డబ్బుగాని, ఆస్తిపాస్తులుగాని, బంధుమిత్రుల బలగంగాని, గౌరవ మర్యాదలుగాని, పదవులు పలుకుబడులు గాని, కీర్తి ప్రతిష్టలు గాని ఎంతటి గొప్పవైనా దేహం విడిచి పోయేటప్పుడు దేహంతో పాటు ఆసాంతం విడిచి పెట్టి పోవలసిందే. వీటిలో ఏ ఒక్కటీ తనతో రాదు. మరి ఏది సంపాదించుకుంటే దేహాంతర యానంలో తనతో వస్తుంది అని చూసినప్పుడు, ఎన్నో విషయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనిషి కోరికలతో ఏ ఏ కర్మలు చేస్తున్నాడో అవి మంచివైనా, లేక చెడ్డవైనా ఆయా కర్మల తాలూకు జీవించి వున్నంతలో అనుభవానికి రాని ఫలాలు (శేషించిన కర్మ ఫలాలు) మరో జన్మలో అనుభవించటం కోసం తన వెన్నంటే వుంటాయి అని పెద్దలు చెప్తున్నారు. ఎంతోమంది విషయంలో ఇది అందరం చూస్తూనే ఉన్నాము. అట్లాగే ఇక్కడ ఏ గుణాలను ఆశ్రయించి ఏ స్వభావాన్ని పెంచుకున్నాడో, ఆ స్వభావమూ తనను విడిచిపెట్టదు, ఏ కోరికలను పెంచుకున్నాడో ఆ కోరికలూ తనను విడిచి పోవు. ఆ స్వభావంతోనే, ఆ కోరికలతోనే, ఆ శేష కర్మ ఫలాలతోనే  అవి ఫలించటానికి అవసరమయ్యే దేహంతో మరో జన్మ తీసుకోబోతున్నాడు. ఇంద్రియ సంబంధమైన కోరికలతోనో అట్టి కోరికలతో నిర్వర్తించిన కర్మల శేష ఫలాలతోనో మరణించిన వారు ఆయా ఇంద్రియ సుఖాలను పొందటానికి తగిన (పశు, పక్షి, క్రిమి, కీటకాది) దేహములను ధరించి మరో జన్మ తీసుకొని ఆయా కోరికలను తగిన ప్రయత్నంతో తీర్చుకోబోతున్నారు. ప్రామాణికమైన శాస్త్రాలన్నీ ఈ విషయాన్నే స్పష్టపరుస్తున్నాయి.

మోఘాశా మోఘ కర్మాణో మోఘజ్ఞానా విచేతసః !
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః !                             9వ అ/12

వ్యర్తమైన కోరికలతో వ్యర్తమైన కర్మలు చేస్తూ వ్యర్తమైన జ్ఞానంతో పనికిమాలిన ఆలోచనలు చేయువారు రాక్షసత్వం తోనూ, ఇంద్రియ లోలత్వం తోనూ సంమోహితమయ్యే స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

ఆసురీం యోని మాపన్నా మూడా జన్మని జన్మని !
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిం !                        16వ అ/20

అసుర గర్భములందు జన్మ తీసుకొనే మూర్ఖులు శాశ్వతమైన అంతరాత్మను గుర్తించనలవికాని వారై అంతకంతకూ హీనమైన జన్మలనే పొందుతుంటారు.

అటువంటి స్వభావాన్ని ఆశ్రయించినవారు మళ్ళీ మళ్ళీ లెక్కకు మిక్కిలి హీనమైన అసుర (పశు, పక్షి, క్రిమి, కీటకాది) జన్మలను పొందవలసి వుంటుందని శాస్త్రం హెచ్చరిస్తున్నది. విశిష్టమైన మానవ జన్మను  వ్యర్థమయ్యేటటువంటి అశాశ్వతమైన విషయాలకోసం దుర్వినియోగపరచుకోరాదని ఇందుమూలముగా తెలియుచున్నది. 
 

కర్మలు ముఖ్యముగా సత్కర్మలు, దుష్కర్మలు అని రెండు విధములుగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. సత్కర్మ చేసిన వారు సత్ఫలితాలను, దుష్కర్మ చేసినవారు దుష్ఫలితాలను పొందుట సహజమే గదా. వీటినే పుణ్య, పాపాలు అని అంటున్నారు. ఈ జన్మలో చేసిన కర్మల తాలూకు గాని, గత జన్మల కర్మల తాలూకుగాని  పుణ్య, పాపాలు మిగిలి వున్నప్పుడు వాటిని సంపూర్ణంగా అనుభవించేంతవరకు మళ్ళీ జన్మలు తప్పవు అని శాస్త్రాలూ రూడి పరుస్తున్నాయి, అనుభవజ్ఞులైన పెద్దలూ అదే చెప్తున్నారు.

ఆధ్యాతికము అనగానే మనకు స్పురించే విషయాలు గుడులు, గోపురాలు, దేవతలు, గురువులు, పూజలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ప్రార్థనలు, ధ్యానాలు, జపాలు,తపస్సులు, మంత్ర సాధనలు, ఆశీర్వచనాలు, గ్రంధ పఠనాలు, పారాయణాలు, సత్సంగ శ్రవణాలు, పురాణ కాల క్షేపాలు, హరికథలు, ఉపవాసాలు, జాగరణలు, భజనలు, కీర్తనలు, భరతనాట్యాలు, ఊరేగింపులు, కళ్యాణాలు, సేవలు వగైరా. ఇంకా ఎన్నెన్నో మతాలు, ఎన్నో మార్గాలు, ఎన్నెన్నో విధానాలు. ఏది చూసినా గొప్పగానే కనిపిస్తున్నాయి. అసలు మనిషి ఆచరించవలసినది ఏది?

శ్రేయస్కరమైనది ఏది అని స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనిషి తన వివేకానికి పదును పెట్టవలసి వుంటుంది. ఎంతటి మహాత్ములు చెప్పే విషయాన్నైనా గుడ్డిగా నమ్మరాదు. ప్రామాణికమైన శాస్త్రంతో సరి చూసుకోవటంతో పాటు, వివేకంతో తరచి తరచి వాస్తవికతను తనకు తాను నిగ్గు తేల్చుకోవలసి వుంటుంది. ఈ దేహం యొక్క, లేదా దేహ సంబంధీకుల యొక్క సుఖ సంతోషాల కోసమో, ఇప్పుడెదుర్కొంటున్న కష్ట నష్టాలనుండి బయట పడటానికో, ఉద్దేశించబడే కర్మలు ఈ నాలుగు రోజుల జీవితానికి, ఈ దేహానికి ఉపయోగపడ వచ్చేమో గాని దేహికి ఎట్టి ప్రయోజనమూ కలగక పోవచ్చు. దేహి అంటే పురుషుడు శాశ్వతమైన వాడు. దేహికి శ్రేయస్కరమైనది ఏదైనా అది శాశ్వతమైన ప్రయోజనం పొందటానికి దోహదపడేదే ఐవుండాలి. కావున అశాశ్వతమైన ప్రయోజనం ఎంత మహత్తరంగా కన్పిస్తున్నా దానిని తృణప్రాయం గానే చూడాలి. అలాగే కోరికలతో నిర్వర్తించే యజ్ఞ యాగాల వలనగాని, దాన ధర్మాల వలన గాని, సేవల వలనగాని, మరే ఇతర మహత్తరమైన కర్మల వలన గాని ఎంతటి గొప్ప పుణ్యం సంపాదించినా, దానివల్ల కొంత కాలం స్వర్గ సుఖాలు అనుభవించటానికి ఉపయోగపడుతుంది తప్ప దేహికి శ్రేయోదాయకం కానే కాదు. ఎందుకంటే దేహి సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. కాల పరిమితులు లేనట్టిది ఆ ప్రయాణం. ప్రతి జన్మలోనూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఏదో కొన్ని సందర్భాలలో మాత్రము స్వర్గ సుఖాలను అనుభవించటం వల్ల ఒనగూరే శాశ్వతమైన ప్రయోజనం ఏమి వుంటుంది? అందువలన ఈ లోకంలో లభించే సుఖాలూ లేదా మరేవైనా ప్రయోజనాల పట్ల కాని, మరణానంతరం లభించే సుఖాలూ, ప్రయోజనాల పట్ల గాని వైరాగ్యం ఏర్పరచుకొని ఉండాలి.  దేహికి అవసరమైన ప్రయోజనం ఒకే ఒక్కటి. అది ఈ ప్రయాణానికి శాశ్వతమైన ముగింపు. ఈ జన్మ పరంపర నుండి విడుదల. అదే మోక్షము అనబడుతున్నది. తానుకానిదానినుండి విడిపడి ఉజ్జ్వలమైన, పరమ పవిత్రమైన, అవ్యయమైన తనను తాను గుర్తించి సనాతనమైన తన అద్వితీయ స్వస్తితిలో తాను ఆనంద స్వరూపుడై ఉండటమే మోక్షము. శ్రేయస్కరమైనది అది ఒక్కటే. అందువల్ల ప్రతి మనిషి మోక్షాపేక్షతో ఉండాలి. దీనినే ముముక్షుత్వము అంటారు. అందుకు ఉపయోగపడే మనో వాక్కాయ కర్మలు చేయాలి.  ఆధ్యాత్మికతకు పరమార్థం అది మాత్రమే. మహాత్ముల బోధలూ, ప్రామాణికమైన శాస్త్రాలూ కేవలం అందుకోసమే.  


మానవ జీవితానికి పరమగమ్యం మోక్షం పొందటమే. 84 లక్షల జీవ రాసులలో మరే ఇతర ప్రాణికీ ఈ అవకాశం లేనే లేదు. ఎందువల్లనంటే శాశ్వతత్వాన్ని గుర్తించగల వివేకం మనిషికి మాత్రమే సొంతం. వివేకంతో శాశ్వతమైన తన స్వరూపమును గుర్తెరిగిన మనిషి మళ్ళీ దేహభావము లోకి జారిపోకుండా తాను తానుగా ఉండాలంటే, విషయ ధ్యానములో పడకుండా విషయాల పట్ల వైరాగ్యంతో వుండాలి.  తనను తాను స్మరించు కుంటూ సర్వ కాల సర్వావస్థలలోనూ తన ఎరుకలో తాను ఉంటూ, దేహముయోక్క, ఇంద్రియముల యొక్క, మనసు యొక్క ప్రతి కదలికనూ గమనిస్తూ వుండాలి. ఇంద్రియాలు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విషయాల పట్ల ఇష్టాయిష్టాలు ఏర్పరచుకోకుండా, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయి, తనకు ఏ సంబంధమూ లేదనీ, తాను కేవలము సాక్షిని అనే భావనతో ఇష్టాయిష్టాల కతీతంగా నిర్లిప్తంగా ఉండాలి. మనస్సులో మెదిలే ఆలోచనలను సైతం రాగ ద్వేషాలు లేకుండా గమనిస్తూ ఉండాలి. దేహం ఏ పని చేస్తున్నా నిర్వికారంగా గమనిస్తూ ఉండాలి. దేహానికి ఏమి జరుగుతున్నా, దేహ ప్రారబ్దం వల్ల అవి అలా జరుగుతున్నాయి, కష్టాలూ, సుఖాలూ వస్తున్నాయి, పోతున్నాయి, దేహియైన తనకు ఎట్టి సంబంధమూ లేదు అని భావించాలి. తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడెప్పుడు ఏదేది జరగాలో అదే జరిగి తీరుతుంది, దేహం ఏది పొందాలో అదిమాత్రమే పొందుతుంది, దేహానికి ఏది దూరమవాల్సి వుందో అది దూరమయ్యే తీరుతుంది, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదను నిర్ధారణ తో నిర్లిప్తంగా వుండాలి.

రాగ ద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ !
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి !                                 2వ అ/64

ఇంద్రియములు వాటి విషయాలలో చరిస్తున్నప్పుడు రాగ ద్వేషాలకు లోను కాకుండా మనసును నిగ్రహించి తన ఆధీనములో నుంచుకొన్న వారికి శాంతి అనుభవమౌతుంది.

కన్ను ఒక వస్తువుని చూస్తున్నప్పుడు, నీ స్వరూపాన్ని నీవు ధ్యానిస్తూ, నీవు నీవుగా ఉండవచ్చు. అలా కాకుండా కన్ను చూస్తున్న వస్తువును ధ్యానిస్తే సంగమం ఏర్పడి, వస్తువు పట్ల రాగమో, ద్వేషమో కలుగు తుంది. అలాగే చెవి ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు, నీ ధ్యానంలో నీవుంటే, శబ్దం వస్తూ వుంటుంది, శబ్దం పోతూ వుంటుంది. నీకే సంబంధమూ లేదు. ఐతే ఇదేమి శబ్దము, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలా వుంది అని ఆలోచిస్తే, నీకు సంగమం ఏర్పడి శబ్దం పట్ల రాగమో, ద్వేషమో కలుగుతుంది. ప్రతి ఇంద్రియ విషయంలోనూ ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది. రాగ ద్వేషాలకు లోనయ్యావు అంటే నీ స్మృతి పోయింది. అంటే నిన్ను నీవు మరచిపోయావు అని అర్థము. ఇంద్రియాలు విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు రాగ ద్వేషాలకు లోను కాకుండా నీవు ఉంటున్నప్పుడు మాత్రమే అంతఃకరణ చతుష్టయంలో ఆత్మ భావన అనుభవమౌతుంది. ఇదే ప్రసాదము (శాంతి) అనబడుతుంది.

ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే !
ప్రసన్న చేతసోహ్యాశు బుద్ధి: పర్యవతిష్టతే !                                  2వ అ/65

ప్రసాదము వలన సర్వ దుఃఖములూ నశించును, మనస్సు నిర్మలమై బుద్ధిలో ఆత్మభావము స్థిరపడును.

నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా !
నాచా భావయతః శాంతి రశాంతస్య కుతః సుఖం !                            2వ అ/66

మనస్సును నిగ్రహించుకోని వానికి వివేక బుద్ధి వుండదు. మనో నిగ్రహము లేనివాడు ఆత్మ భావనా చెయ్యలేడు. ఆత్మ భావన చెయ్యలేని వానికి శాంతి అనుభవం కాదు. శాంతి లేని వానికి సుఖమెక్కడిది.

మనసును నిగ్రహించుకోవటమే యుక్తము అనబడుతుంది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనబడు షట్సంపదలను  పెంచు కున్నప్పుడు మనస్సును నిగ్రహించి లక్ష్యంపై స్థిరపరచడం సాధ్యమౌతుంది. ప్రపంచ విషయాలన్నీ మారేవే, పోయేవే కనుక వాటి వలన తనకెట్టి ప్రయోజనమూ లేదనే దృక్పథం ఏర్పరచుకున్నప్పుడు విషయాల పట్ల ఆసక్తి పోయి మనో చాంచల్యం తగ్గి లక్ష్యం పై కేంద్రీకరించ గలగటం కుదురుతుంది. దీనినే శమము అంటారు. విషయాసక్తి లేనప్పుడు కర్మేన్ద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ వాటి విషయాలలో అవసరమైనంతవరకే ప్రవర్తిస్తూ పరిమితులలో వుంటాయి. దీనినే దమము అంటారు. చిత్తం బాహ్య విషయాలపైకి పోకుండా ఆత్మపై లఘ్నం చేసి ఉంచగలగటం ఉపరతి అనబడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవి తన ప్రారబ్దము వల్లనే వచ్చాయి తప్ప వేరెవ్వరూ కారణం కానే కాదని నమ్మి దుఃఖంలో మునిగిపోకుండా, ప్రతీకార భావన లేకుండా, ఇదీ మారేదే పోయేదే కదా అనుకుంటూ ఓర్పుతో ధైర్యంతో ఉండటమే తితిక్ష. శాస్త్రం పట్ల, గురు వాక్యం పట్ల అచంచలమైన విశ్వాసంతో సత్య దృష్టి ఏర్పరచుకొని ఉండటమే శ్రద్ధ అనబడుతుంది. నిరంతరమూ ఆత్మ భావనతో ఉండటమే సమాధానము.

గత కర్మల దోషాలు (అంటే ఈ జన్మలో ఇప్పటివరకు చేసిన దుష్కర్మల తాలూకువిగాని, గత జన్మలలో చేసిన దుష్కర్మల తాలూకువి గాని) మనస్సు ఆత్మ భావములో స్థిరపడకుండా అడ్డుపడుతుంటాయి. ఈ దోషాల నుండి బయటపడి పవిత్రత పొందాలంటే యజ్ఞ, దాన, తపో కర్మలను శాస్త్రం నిర్దేశించిన విధంగా ఆచరించాలి.  అనునిత్యమూ త్రికరణ శుద్ధిగా యజ్ఞ, దాన, తపస్సులను అనుష్టించి పవిత్రులైన వారికి మనో నిశ్చలత పొందటానికి యోగ్యత లభిస్తుంది. అప్పుడు శమ దమాదులతో మనో నిగ్రహం సాధించిన సమాధి స్థితి (అంటే భావాతీతంగా కేవలం తాను తానుగా ఉండటం) అనుభవానికి వస్తుంది. అప్పుడు మాత్రమే వాని బుద్ధిలో తాను ఆత్మ స్వరూపమనే విషయం నిశ్చయమౌతుంది. ఈ నిశ్చయంతో రాగద్వేషాలకు అతీతమైన మనో నిశ్చలత, నిండైన త్రుప్తి, ప్రపంచం ఎలావున్నా, దేహానికి ఎమౌతున్నా తనలో చెక్కు చెదరని శాంతి అనుభవంగా వుంటుంది.  ఈ శాంతితో, ఈ త్రుప్తితో జీవించటమే జీవన్ముక్తావస్థ అనబడుతుంది. ఇది  ఏ మార్పూ, మరణమూ లేని స్థితి. ఏ జీవికీ ఇంతకంటే పొందవలసిన శ్రేయస్కరమైనదేదీ లేదు. ఈ స్థితిలో దేహం రాలిపోతే అదే మోక్షము అనబడుతుంది.    

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు !  అందరికీ శుభమే జరుగు గాక !
సర్వేషాం శాంతిర్భవతు !   అందరూ సుఖ శాంతులతో ఉండుగాక !
సర్వేషాం పూర్ణం భవతు !  అందరి జీవితమూ సమృద్ధిగా ఉండుగాక !
సర్వేషాం మంగళం భవతు !  అందరి జీవితమూ మంగళకరముగా ఉండుగాక !

లోకాః సమస్తాః సుఖినో భవంతు !!
ఓం! శాంతి: శాంతి: శాంతి:!!!

ఇది అపార  కరుణామయులు, అనంత దైవ సంపన్నులు, సాక్షాత్ జ్ఞాన స్వరూపులు, మర్మయోగి, సచ్చిదానంద సమర్థ సద్గురు మహాత్ములైన శ్రీ శ్రీ శ్రీ భవఘ్ని గురు దేవుల దివ్యానుగ్రహ సత్సంగ ప్రవచనములనుండి వారి శిష్యులలో నధమ శ్రేణికి చెందిన ఒకానొక సాధకునిచే గ్రహించబడినది. దీనిని పరిశీలించిన పండితులిందుగల జ్ఞాన విషయములు శ్రీ గురు దేవుల అమృత వాక్ధారల నుండి జాలువారినవిగను, దోషము లేవైన గన్పట్టిన నవి సాధకుని జ్ఞానలేమి వలన మాత్రమే సంభవించి నట్లుగను గ్రహింప గలరు.