The views expressed by the members are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks
ఓం శ్రీ గురుభ్యో నమః
మనమంతా సాధారణంగా మన స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాము. ఈ స్వభావాన్ని బట్టే మాటలు, చేతలు, ప్రవర్తన ఉంటుంది. ఈ మాటలకు, చేతలకు మూలం ఆలోచనలే. ఈ స్వభావం మనకు ఎలా ఏర్పడుతుంది? మనం ఏదయినా ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ప్రకారం మాట్లాడుతూ, ఆ ప్రకారమే పనులు చేస్తూ, అదే ఆలోచన మరల మరల చేస్తూ వుంటే, అదే స్వభావంగా రూపుదిద్దుకుంటుంది. దీన్నే ఆద్యాత్మికంగా "వాసన" అంటారు.ఈ వాసనలు ఆధ్యాత్మికంగా చాలా ముక్యమయిన విషయాలు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళదాము అనుకుంటే, మనం నడిచే మార్గంలో, సరైన సాధన విధానాన్ని తీసుకొని, సరైన రీతిలో సాధన చేస్తూ, కృషి చేసినప్పుడు మాత్రమే ఈ వాసనలను మార్చుకోగలుగుతాము. లేకుంటే "వాసనాక్షయం" సాద్యం కానే కాదు. ఈ వాసనలనే సంస్కారాలు అనీ, స్వభావము అనీ అంటారు. మంచి సంస్కారాలు ఉంటే జీవితం కూడా మంచిగా ఉంటుంది. అసలు మనం సరైన సంస్కారంతో ప్రవర్తిస్తున్నామా ? లేదా? అని తెలుసుకోవాలంటే, మన శ్రేయస్సు కోరి మహాత్ములు ఏమి చెప్పారు? శాస్త్రం ఏమి చెప్పింది ? మనం ఎలా ఉండాలి ? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాలను గురించి భగవద్గీతలో దైవాంసుర సంపత్ విభాగ యోగంలో వివరించారు.
ఓం శ్రీ గురుభ్యో నమః
జబ్బు ఒకటి వుంది. దానికి మందు ఒకటి వుంది. ఇది ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జబ్బు వున్నది, మందు వున్నది అని చెబుతున్నవారు పెక్కుమంది ఆ జబ్బుతో తామే బాధపడుతున్నారు గాని ఆ మందు మింగటం లేదు. జబ్బు తగ్గాలి అంటే వైద్యుని దగ్గరకు వెళ్ళాలి, వైద్యుడు సూచించిన మందును వైద్యుడు సూచించిన పథ్యంతో వేసుకోవాలి. అప్పుడు జబ్బు తప్పకుండా తగ్గుతుంది.
భవరోగం అనే జబ్బు వున్నది. పథ్యాన్ని ఆచరిస్తూ ఇదిగో ఈ మందు వేసుకుంటే నయమౌతుంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఆ మందును పథ్యంతో సహా తామే వేసుకోకుండా ఆ జబ్బుతో బాధపడుతున్నారు. మందు పేరును పదేపదే మాట్లాడుతున్నంతమాత్రాన గాని, ఆ మందును అరచేతిలో పెట్టుకొని ఇదిగో ఇదిగో అంటూ అందరికీ చెబుతున్నంతమాత్రాన గాని, పథ్యాన్ని ఎలా పాటించాలో, మందు ఎలా మింగాలో తెలిసినంత మాత్రాన గాని జబ్బు తగ్గదుగదా! ఐతే ఈ రోజున అనేకమంది తాము స్వీకరించాకుండానే మందును గురించి ప్రచారం చేస్తున్నారు. ఇది చూసి మిగిలిన వాళ్ళందరూ ఒక అయోమయ స్థితికి గురౌతున్నారు. ఐతే ఆ జబ్బును పోగొట్టుకున్నవాళ్ళు సూచించిన విధంగా పథ్యం ఆచరిస్తూ మందును స్వీకరించినట్లైతే జబ్బు తప్పకుండా నయమై తీరుతుంది.
ఓం శ్రీ గురుభ్యో నమః
ఉపనిషత్తుల సారమైన శ్రీమద్భగవద్గీతా శాస్త్రము యొక్క పరమోద్దేశ్యం ఏమిటో అంతిమముగా బోధకుడైన గురువు అడిగిన ప్రశ్న వల్లనూ, శిష్యుని సమాధానము వల్లనూ స్పష్టపడుచున్నది. శ్రీమద్భగవద్గీతను పారాయణం చేస్తే పొందవలసిన ఫలమేదో ఈ క్రింది రెండు శ్లోకాలలో విశదమౌతున్నది.
కచ్చిదేతచ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా !
కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ! 18వ అ/72
పార్థా! భగవద్గీతా శాస్త్ర బోధను ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ధనంజయా! అజ్ఞానము వల్ల ఉత్పన్నమైన మోహము పోయిందా?
నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్మయా చ్యుత !
స్థితో స్మి గత సందేహః కరిష్యే వచనం తవ ! 18వ అ/73
మీ కృప వలన నా మోహం పోయింది. స్మృతిని పొందాను. సంశయ రహితుడనై జారిపడని స్థితిలో ఉన్నాను. తమ వచనములను ఆచరిస్తాను.
ఓం శ్రీ గురుభ్యో నమః
అనేక జన్మలలో మనం చేసిన కర్మల ఫలాలు పాప పుణ్యాల రూపములో రాశులుగా వున్నాయి. ఇవే సంచిత కర్మలు అనబడుతున్నాయి. వాటిలో నుండి ఈ జన్మకు కారణమైన ఒక పిడికెడు కర్మ ఫలాలతో ఈ దేహమును పొందాము. ఈ జన్మలోనే అనుభవించి తీరాలని నిర్దేశించబడిన ఆ పిడికెడు పూర్వ కర్మల ఫలాలను ప్రారబ్దము అంటున్నారు. ఇంతకు ముందు చేసిన కర్మల ఫలాలను నేడు అనుభవిస్తున్నాము. అదే ప్రారబ్దము అనబడుతున్నది. నేడు చేస్తున్న కర్మలకు ఫలితం రేపు (భవిష్యత్తులో) అనుభవించబోతున్నాము. దీనిని ఆగామి అంటారు. మనస్సు, వాక్కు, దేహము అనే మూడు ఉపకరణాలలో కదలికలనే కర్మ అంటారు. అందువల్ల మానసిక కర్మ, వాక్కర్మ, శారీరక కర్మ అనే మూడు విధాలుగా మనం కర్మలు చేస్తున్నాము. ఈ మూడు విధాలుగా చేయబడుతున్న కర్మలు సత్కర్మ, దుష్కర్మ అని రెండు రకాలు ఉంటాయి. సత్కర్మల ఫలితం సుఖం రూపంలోనూ, దుష్కర్మల ఫలితం దుఃఖం రూపంలోనూ పొందవలసి వుంటుంది. ఇది అందరికీ అనుభవమే. వాక్కర్మ, దేహకర్మలు చేస్తున్నప్పుడు అవి స్పష్టంగా అందరికీ తెలుస్తున్నాయి గనుక తదనుగుణంగా లభించే ఫలితాలను అందరూ సులభంగానే అన్వయించుకో గలుగుతున్నారు. కానీ, మానసిక కర్మ జరుగుతున్నప్పుడు, అది అందరికీ తెలియబడుట లేదు. అందువలన మానసిక కర్మ ఫలాలను అన్వయించుకోవటంలో భంగపడుతున్నారు. దానికి కారణం మానసికంగా చేస్తున్న కర్మలను గుర్తించకపోవటం మాత్రమే. ఖాళీగా కూర్చుని వున్న వ్యక్తిని, ఏమి చేస్తున్నావని అడిగినప్పుడు, ఆలోచిస్తున్నాననే సమాధానం చెప్పడం సహజమే గదా. అంటే అక్కడ మనసుతో ఒక కర్మ చేస్తున్నట్లు తెలుస్తూనే వుంది. ఐతే ఎంతోమంది కేవలం ఆలోచనలతో చేసే కర్మలకు సైతం ఫలితాలుంటాయని తెలియక, అవి ఇతరులకు తెలియవు గనుక మానసిక దుష్కర్మ చేస్తుంటారు. ఇతర కర్మలతో పోల్చి చూసినప్పుడు మానసిక కర్మ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. అన్ని కర్మలకూ ఫలితాలను సంపూర్ణంగా అనుభవించి తీరవలసిందే. ఇది సృష్టి నియమం. దీనినే నియతి అంటారు.