Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

Voice of Members - MSC Bose

1) శాంతిగా ఉండటం!
2) అందరూ శాంతిగా ఉండాలని కోరుకోవటం!
3) అందరూ శాంతిగా ఉండటానికి సహకరించటం!
4) ఎవరి శాంతికీ భంగం కలిగించకుండా ఉండటం!

మహాత్ములైన శ్రీ భవఘ్ని గురు దేవుల అడుగు జాడలలో నడుస్తున్న భవఘ్ని సభ్యులందరికీ ఇది జీవిత లక్ష్యం.

అతి సాధారణంగా కన్పిస్తున్న పై నాలుగు విషయాలను సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం.

శాంతిగా ఉండటం అంటే ఏమిటి?
ఏ అలజడీ, దుఖ్ఖమూ లేకుండా ఉండటం అని అందరూ అనుకొనే విషయమే. ఈ స్థితి ఎన్నో సమయాలలో అందరికీ అనుభవమైనదే. ఐతే అన్ని సమయాలలోనూ అలా ఉండటం ఎలా అన్నదే సమస్య. జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సమస్యలు ఎదురౌతుంటాయి.

కొన్ని తనకు తానుగా కొనితెచ్చుకొనే సమస్యలు (ఆధ్యాత్మికము).
 తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగకపోవడం, తనది అనుకొన్నది తనకు దూరమవడం, తన ఆధీనంలో ఉంటున్నది తనకు ఇష్టం లేని విధంగా మారడం, తన దేహెంద్రియాలు సైతం తన అధీనంలో ఉండకపోవడం మొదలైన ఎన్నో సమస్యలు.

కొన్ని ఇతర జీవులవల్ల, లేక ఇతర వస్తువులవల్ల, లేక పరిస్థితులవల్ల ఏర్పడే సమస్యలు (అధిబౌతికము).
దుర్మార్గుల వలన కలిగే బాధలు,అవమానాలు, దొంగలు, మోసగాళ్ళ వలన కలిగే నష్టాలు, క్రూర జంతువుల వలన ప్రమాదాలు, ప్రతికూల వాతావరణం మూలంగా వచ్చే సమస్యలు, కాలుష్యాల వలన కలిగే ఆరోగ్య సమస్యలు,

కొన్ని ఊహకందని పరిణామాల వల్ల ఏర్పడే సమస్యలు (అధిదైవికము)
భూకంపాలు, అఘ్నిపర్వత విస్పొటనాలు, మొదలగు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే కష్ట, నష్టాలు, ప్రమాదాలు, దురదృష్టకర పరిణామాలతో కలిగే కష్ట, నష్టాలు మొదలైనవి.
 ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని సందర్భాలలోనూ శాంతిగా ఉండగలగాలి.
ఇదే శాంతిగా ఉండటం అంటే.
సాధారణమైన జీవితాన్ని గడిపే వారికి ఇది సాధ్యమేనా? సాధారణంగా ఎంతోమంది తాము శాంతిగా వుండటం కోసం ఇతరుల శాంతికి భంగం కలిగిస్తూ వుంటారు. తమకే ఉపయోగమూ లేకపోయినా ఇతరుల శాంతిని భంగపరచే వారున్న నేటి సమాజంలో తాము శాంతిగా ఉంటూ, అందరి శాంతినీ కోరుకుంటూ, అందరి శాంతికీ సహకరిస్తూ, ఎవరి శాంతినీ భంగ పరచ కుండా జీవించడం సాధ్యమేనా?
ఇది సాధ్యమే అని భారత జాతి గర్వించే విధంగా మన పూర్వీకులు తమ అనుభవాలతో కాచి వడపోసిన అత్యున్నత విలువలతో కూడిన జీవన విధానాన్నిఆధునిక ప్రపంచ మానవాళికి అందిన అతి గొప్పవైన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి.

అటువంటి జీవన విధానం ఆచరించే వారికి పూర్ణ సంత్రుప్తికరంగాను, పరమానంద దాయకంగాను ఉండడమే కాకుండా, వారి అనుపానులలో నున్న యావన్మందికి శాంతిని చెకూర్చేదిగా వుంటున్నదని సామాజిక చరిత్రలో ఎన్నో ఉదంతాలు సూచిస్తున్నాయి. కానీ,అతి నిగూఢమైన అట్టి జీవన విధానం అందరూ సునాయాసంగా గ్రహించే టట్లు లేదు. ఐతే అట్టి జీవన విధానాన్ని ఆచరిస్తున్న అనుభవజ్ఞులలో ప్రజ్ఞావంతులైన మహాత్ములు ఆచరణ సంసిద్ధులైన వారికి బహు ఉదారంతో శాస్త్రానుగుణంగా విశదపరుస్తున్నారు.

కడు దుర్లభమైన అట్టి మహాత్ముల కోవలో "శ్రీ శ్రీ శ్రీ భవఘ్ని గురుదేవులవారు"  తెలుగు వారి పాలిట పెన్నిధిగా గలరు. అపార కరుణా మయులైన ఆ సద్గురు దేవుల అనుగ్రహంతో వేల కొలది భవఘ్ని సభ్యులు  అత్యున్నతమైన ఆ జీవన విధానాన్ని అలవారచుకోడానికి సమాయుత్తులౌతున్నారు. ఇప్పటికే వారిలో ఎంతోమంది కొద్దిపాటి సాధనతోనే ఆ శాంతి ఛాయలను అనుభవిస్తున్నారు. మహత్తరమైన ఆ పరమ శాంతిని సంపూర్ణంగా పొందాలని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతున్నారు.

క్రొత్తగా భవఘ్ని సభ్యులు కాదలచిన వారికి ఉండవలసిన అర్హతలు:
1) అనసూయత్వము (సత్యాన్ని గ్రహించడానికి సంసిద్ధత)
2) శాస్త్రముల పట్ల, సత్పురుషుల పట్ల ప్రేమ, గౌరవము
3) శ్రద్ధ, వినమ్రత 
4) శ్రీ భవఘ్ని గురూజీ వారి సత్సంగ ప్రవచనాలను విన్న అనుభవం (సత్సంగ ప్రవచనాలు DVD రూపంలో లభిస్తున్నాయి.
5) శ్రీమద్భగవద్గీత శ్లోకములు కనీసం రెండు అధ్యాయాలైనా తెలిసి వుండాలి.
6) శాంతి జీవన సాధనకు, సత్సంగములలో పాల్గొనడానికి సంసిద్ధత.

అందరూ సుఖంగా శాంతిగా ఉండుగాక!
అందరి జీవితమూ సమృద్ధి కరంగా ఉండుగాక!
అందరి జీవితమూ మంగళ కరంగా ఉండుగాక!     
 
శ్రీ  శ్రీ  శ్రీ   భవఘ్ని గురుదేవులవారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో,నమస్కరించుకుంటూ 

గురుదేవులవారి అనుగ్రహం  కోరుకుంటూ...... 

 

 

MSC బోస్

హైదరాబాద్.

 భవఘ్ని సభ్యుడు. 

                                                                                                              

Page 2 of 2